December 19, 2018

varun-tej-18-12

ఫిదా, తొలిప్రేమ.. ఇలా వరుసగా హిట్స్ వస్తున్నాయి. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలొస్తున్నాయి. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉండనే ఉంది. అయినప్పటికీ విలన్ గా నటించడానికి అంగీకరించాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ రీమేక్ సినిమాలో తను ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాననే విషయాన్ని గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు వరుణ్ తేజ్.

జిగర్ తాండా.. 2014లో కోలీవుడ్ లో హిట్ అయిన సినిమా. ఇందులో హీరోగా సిద్దార్థ్ నటించాడు. విలన్ గా బాబి సిమ్హా కనిపించాడు. ఓ రియల్ లైఫ్ గూండా లైఫ్ తో సినిమా చేయాలనుకుంటాడు హీరో. రీసెర్చ్ కోసం నిజంగానే గూండా దగ్గరకెళ్తాడు.

కట్ చేస్తే ఆ గూండా తననే హీరోగా పెట్టమంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అలానే చేస్తాడు సిద్దార్థ్. ఫైనల్ గా గూండాతోనే సినిమా చేస్తాడు. క్లైమాక్స్ లో ఏం జరిగిందనేది జిగర్ తాండా కథ. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో బాబి సిమ్హా పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు.

ఈ మేరకు హరీష్ శంకర్ తో చిన్నపాటి డిస్కషన్ పూర్తయినట్టు ప్రకటించాడు వరుణ్. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులు చేసే పనిలో హరీష్ బిజీగా ఉన్నాడని, త్వరలోనే పూర్తి కథ వింటానని తెలిపాడు.

జిగర్ తాండా సినిమా తెలుగులోకి కూడా వచ్చింది. చిక్కడు దొరకడు పేరుతో ఇది డబ్ అయింది. కాకపోతే టాలీవుడ్ లో ఈ సినిమా ఆడలేదు. ఇప్పుడీ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి రీమేక్ చేయబోతున్నాడు హరీష్ శంకర్.