01 February, 2019

sp-balasubramanyam

సినీ రంగంలో దిగ్గజ స్థాయిని అందుకుని, గొప్ప గౌరవ మర్యాదలు సంపాదించిన వ్యక్తులు.. రాజకీయాల జోలికి అస్సలు వెళ్లరు. ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడరు. ఐతే గాన గంధర్వుడు ఎస్పీ బాలు తాజాగా తిరుపతిలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. వ్యవస్థ రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఉదాహరణలు ఇస్తూ ప్రస్తుత రాజకీయ నాయకులు ఎలా దిగజారి పోయారో ఆయన వివరించారు.

‘‘ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి 15 హత్యలు చేసి అతనికి యావజ్జీవ ఖైదు విధిస్తే.. 14 ఏళ్లలోపు ఏదో ఒక కారణాల వల్ల జైలు నుంచి బయటికొచ్చేస్తాడు. తర్వాత ఎవరో ప్రాప్తమో సంపాదించి.. వాళ్ల కాళ్లొత్తి చేతులొత్తి.. ఇంకా చేయకూడని పనులన్నీ చేసి టికెట్ సంపాదించుకుంటున్నాడు. అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడి, గెలిచి.. మంత్రి కూడా అయ్యి.. తనను ఎవరైతే అరెస్ట్ చేశారో వారితోనే సెల్యూట్ కొట్టించుకునే పరిస్థితి. ఇదీ చట్టం? ఇది చట్టమేనా? ఎలా కుదురుతుంది ఇదంతా’’ అంటూ ఆవేదనగా బాలు ప్రశ్నించారు.

పార్టీలు ఫిరాయించేవాళ్లకు కూడా బాలు ఘాటుగా చురకలు అంటించారు. ‘‘ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. ఇంకేదో పార్టీ బాగుంటుందని అందులోకి వెళ్తున్నారు. అసలు ఆ నేత ఎక్కడ నిలబడి ఏ ప్రజలతో ఓటు వేయించుకున్నాడో వాళ్ల అనుమతి పార్టీ మారడానికి అక్కర్లేదా? ఫలానా పార్టీలో పని చేస్తే ఇదిగో ఇలా చేయగలను అని అబద్ధమైనా చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. అలాంటి నేతలు కనబడితే మనం మాత్రం ఏమీ మాట్లాడకుండా చప్పట్లు కొట్టేస్తున్నాం’’ అని బాలు అన్నారు. తాను రాజకీయాల జోలికి పోదల్చుకోలేదని.. అసలు తాను రాజకీయాలను తెలుసుకోదలుచుకోలేదని. రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉంటానని అన్న బాలు.. సమాజ స్పృహ కోసమే ఇలా మాట్లాడుతున్నానని.. అంతే తప్ప ఎవర్నీ టార్గెట్ చేయలేదని ముక్తాయింపు ఇచ్చారు.

sp balu, political comments, singer balu

----------------------------------------------------------------------------