December 07, 2017

sapthagiri-llb-movie-review

ఈ సినిమా ఒరిజినల్ రీమేక్ అయిన హిందీ 'జాలీ ఎల్ఎల్ బి' దర్శకుడు సుభాష్ కపూర్ ఈ సినిమాను అద్భుతంగా తీసి ఒక కల్ట్ సినిమా స్టేటస్ పొందగలిగాడు. అలాగే ఆ సినిమా లో అద్భుతంగా నటించిన హీరో అర్షద్ వార్సీ మరియు బొమన్ ఇరానీ ల పాత్రలకోసం సప్తగిరి, సాయి కుమార్ ను ఎంపిక చేయడం బెస్ట్ సెలక్షన్. వారు కూడా వారి పాత్రలను పూర్తి న్యాయం చేసి ఈ తెలుగు రీమేక్ ను మునిగి పోకుండా కాపాడగలిగారు.

నిజాయితీగా చెప్పుకుంటే ఈ సినిమా దర్శకుడు చరణ్ లక్కాకుల చాలా బలహీనమైన పేలవమైన దర్శక ప్రతిభను చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా బలవంతపు కామెడీ మన మీద రుద్ది అర్ధం పర్ధం లేని సన్నివేశాలతో, అనవసరపు డ్యూయెట్ సాంగులతో విపరీతంగా బోర్ కొట్టిస్తాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ లో సాయి కుమార్ 'రామ్ జెఠ్మలానీ' పోలిన లాయర్ పాత్రలో హుందాగా నటించి సినిమాకు ఒక స్టాండర్డ్ ఇవ్వగలిగాడు. సాయి కుమార్ సన్నివేశాలు లేకుంటే ఇంటర్వెల్ వరకు ప్రేక్షకుల పాలిట ఒక నరకంగా మారి ఉండేది.

కానీ సెకండ్ హాఫ్ లో కధలోని ముఖ్యమైన పాయింట్ హైలైట్ అయి ఆసక్తికరంగా మారుతుంది. చివరి 45 నిముషాలు మంచి ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాకుండా నేటి సమాజ వర్తమాన సంఘటనలకు అద్దం పట్టేలా మంచి పదునైన డైలాగులతో రక్తి కట్టింది. ముఖ్యంగా సప్తగిరి, సాయి కుమార్ ఇద్దరూ మంచి కెమిస్ట్రీ తో పోటాపోటీ నటనతో అలరించారు. అలాగే జడ్జీ పాత్రలో ఎం శివప్రసాద్ కూడా బాగా ఆకట్టుకుంటాడు. మొత్తానికి సెకండ్ హాఫ్ ఆసక్తి కరంగా ఉండడం తో ఈ సినిమా గట్టెక్క గలిగింది.

ఇక కథ విషయానికి వస్తే సప్తగిరి చిత్తూరులో ఎల్.ఎల్.బి పూర్తిచేసి పెద్ద లాయర్ కావాలనే ఆశతో అక్కడ నుండి హెదరాబాద్ కు వచ్చి పేరు ప్రఖ్యాతులు పొంది తన మరదలును (కషిష్ వోహ్రా ) పెళ్లి చేసుకోవాలని కుంటాడు. కానీ ఒక పెద్ద పేరు ప్రతిష్టలు పొందిన లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) ను ఒక పెద్ద పారిశ్రామిక వేత్త కొడుకు తాగి 6 మందిని ఫుట్ పాత్ పై కారుతో తొక్కి చంపిన కేసు వాదిస్తుంటే చూసి ఆయన ప్రతిభకు ముచ్చట పడతాడు. కానీ ఆ కేసులో చనిపోయిన వారి అసలు విషయాలను తెలుసుకొని మానవత్వం కోసం ఆ కేసుపై ఒక పిల్ వేసి ఆ కేసు ను తిరిగి కోర్టుకు రప్పిస్తాడు.

పెద్ద వారు కాబట్టి సప్తగిరిపై దాడి చేయిస్తారు, సాక్షులను బెదిరిస్తారు. కాని చివరకు సప్తగిరి ఈ కేసును ఎలా జయిస్తాడు అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ఇక నటుల విషయానికి వస్తే సప్తగిరి ఈ సినిమా తో పూర్తి స్థాయి సోలో హీరో గా ఎదిగినట్లే. డాన్సులు బాగా చేశాడు. ఫైట్లు కూడా కుమ్మేశాడు. కెమెడీ అతనికి బాగా తెలిసిన విద్యే కనుక ఆకట్టుకుంటాడు. కానీ చివరి కోర్టు సీన్లో ఎమోషనల్ గా ఆవేశంగా డైలాగులు చెప్పి ఫుల్ మార్కులు కొట్టేశాడు. సాయి కుమార్ తన సీనియారిటీ తో అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ కషిష్ వోహ్రా అందంగా ఉంది, నటనకు ఈమె అస్సలు పనికిరాదు.

సన్నివేశాల టేకింగ్ టెక్నీకల్ గా బాగా లేదు. విజయ్ బల్గెనిన్ సంగీతం లోని పాటలు జస్ట్ ఓకే కానీ బ్యాక్ గ్రవుండ్ సంగీతం బాగానే ఉంది. సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది, గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు.

మొత్తానికి ఈ సినిమా సెకండ్ హాఫ్ లోని మంచి ఆసక్తికరమైన సన్నివేశాల కోసం ఒక సారి తప్పక చూడొచ్చు. సాయి కుమార్ అసమాన నటన అలాగే ఆకట్టుకునే సప్తగిరి నటన కోసం నిరభ్యంతరంగా ఒక సారి చూడొచ్చు.

- పర్వేజ్ చౌదరి