December 19, 2018

ram-gopal-varma-18-12

‘ఎన్టీఆర్- కథానాయకుడు’ మూవీ పాటలను ఈనెల 21న విడుదల చేసేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తోంది యూనిట్. ఇదే క్రమంలో లైన్‌లోకి వచ్చి బాంబు పేల్చాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ. తాను తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ‘వెన్నుపోటు’ పాట, ఫస్ట్ లుక్‌ని అదేరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తానని ప్రకటించాడు.

ఎన్టీఆర్ లైఫ్‌లోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! దీంతో వర్మ ట్వీట్‌పై నెటిజన్స్ ఓ రేంజ్‌లో జోకులు వేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ షూట్ మొదలైన నుంచి ఏదోవిధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ప్రస్తావిస్తూనే వున్నాడు వర్మ. ఇంతకీ వర్మ ‘వెన్నుపోటు’ పాట రిలీజ్ చేస్తాడా? ఎప్పటిమాదిరిగా ప్రచారానికే పరిమితమవుతాడా అన్నది చూడాలి.

ఇదిలా ఉండగా.. వర్మ ‘వెన్నుపోటు’ సాంగ్ పోస్టర్ విడుదల చేస్తానని ప్రకటించిన డిసెంబర్ 21నే వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను విడుదల చేయాలని వర్మ భావిస్తుండటంతో రాజకీయంగా వైసీపీకి మేలు చేకూర్చేందుకే సినిమాను తీస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీలోని ఏ ఒక్క నేతను కించపరిచేలా సినిమా ఉన్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.