07 March, 2019

pawan-kalyan-19-3-7

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో, సుడిగాలి ప‌ర్య‌ట‌నలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తన గుంటూరు పర్యటనలో భాగంగా నర్సరావుపేటలో జనసేన ప్రజాపోరాటయాత్రలో ఆయన మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మధ్య రోజురోజుకు పెరుగుతోన్న ఆరోపణలు, విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేశారు. `తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. మీ రాజకీయాలకు ప్రజలను బలి చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అలసిపోయాం... మీ రాజకీయాలు మాపై రుద్దొద్దు`` అని కోరారు. త‌ద్వారా డేటావార్‌లో హుందాగా స్పందించారు.

ప్రభుత్వ అధికారుల లంచాల్లో వాటాలు తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఏ సమాజంలో ఉన్నామో అర్థంకాని పరిస్థితి ఉందని ప‌వ‌న్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలను ధైర్యంగా తిప్పికొట్టే ప్రయత్నమే జనసేనా పార్టీ ఆవిర్భావమని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. జనాసేన జెండా పట్టుకున్న ప్రతీ ఒక్కరూ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎదిరించాలని పిలుపునిచ్చారు. పల్నాడు ప్రాతంలో 30 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ జరిగితే ప్రశ్నించే ధైర్యం లేదా? అని ప్రజాప్రతినిధులను పవన్ నిలదీశారు.

ఇదిలాఉండ‌గా, ఈ ప‌ర్య‌ట‌న‌లోనే టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేనానిని క‌లిశారు. ఒంగోలులోని బృందావనం కల్యాణ మండపంలో ఈ ఇద్ద‌రూ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు పవన్ కల్యాణ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశం కొనసాగింది. అయితే, కుటుంబ విషయాలు మాట్లాడుకున్నామని చెప్పి మాగుంట అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి వీరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరిగాయన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా... టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయంలో స్పష్టతలేదు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి... పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది.

Pawan kalyan, telangana cm, andhra cm

----------------------------------------------------------------------------