07 March, 2019

Namrata-Sukumar-19-3

అనౌన్స్‌మెంట్‌తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మహేష్ బాబు-సుకుమార్‌ల సినిమా ఊహించని విధంగా క్యాన్సిల్ కావడం టాలీవుడ్ జనాలకు, ప్రేక్షకులకు పెద్ద షాకే. కమర్షియల్ సక్సెస్ కాకపోయినా క్లాసిక్ అనిపించుకున్న ‘1 నేనొక్కడినే’ తర్వాత.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఈసారి కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఫ్యాక్టర్ కూడా మిక్స్ చేసి మహేష్‌కు సుక్కు ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఆశించారు. కానీ ఈ సినిమా ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో క్యాన్సిల్ కావడం ఊహించని పరిణామమే. ఇలా జరగడానికి మహేష్ కారణమా.. సుకుమార్ బాధ్యుడా అన్న డిస్కషన్లు గట్టిగా నడుస్తున్నాయి. ఐతే వీళ్లిద్దరి కంటే మహేష్ భార్య నమ్రతనే సినిమా రద్దవడానికి ప్రధాన కారణం అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నమ్రతతో పెళ్లి తర్వాత మహేష్ ఎంతగా మారాడో అందరికీ తెలుసు. మహేష్ మార్కెట్ వాల్యూ అమాంతం పెరగడంలో నమ్రత పాత్ర కీలకం. అతడిలో బోలెడన్ని బ్రాండ్లకు ప్రచారం చేయించడం మొదలుకుని.. ఎప్పుడు ఎవరితో సినిమా చేయాలి, పారితోషకం ఎంత తీసుకోవాలి లాంటి అంశాలన్నీ ఆమే చూసుకుంటోంది. మహేష్‌ను పూర్తి కమర్షియల్‌గా మార్చింది నమ్రతే అంటారు.

సుకుమార్ సినిమా విషయానికి వస్తే.. దీని కోసం అతను దాదాపు పది నెలల పాటు డేట్లు అడిగాడట. ఆ పది నెలలూ మరో సినిమా చేయకూడదని.. కొన్ని నెలల పాటు లుక్ కోసం కష్టపడాలని.. సమాంతరంగా మరో సినిమా ఏదీ చేయకూడదని కండిషన్ పెట్టాడట. ఐతే పది నెలల మహేష్ డేట్లు ఎంత విలువైనవో బాగా తెలిసిన నమ్రత అందుకు ఒప్పుకోలేదని సమాచారం.

సుక్కు సినిమా చేస్తే వచ్చే పేరు సంగతేమో కానీ.. ఆదాయం పరంగా అది అంత లాభదాయకం కాదని.. దీని బదులు అనిల్ రావిపూడి సినిమా కోసం ఒక మూడు నెలలు పని చేసినా అంతకుమించి పారితోషకం వస్తుందని.. అనిల్ సత్తా ప్రకారం ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడానికి కూడా మంచి స్కోప్ ఉందని భావించి.. ఆమె సుక్కు సినిమాను మహేష్ వదులుకునేట్లు చేసినట్లు సమాచారం.

namrata, sukumar, business decision

----------------------------------------------------------------------------