January 09, 2018

lalu-prasad-yadav-18-1-9

లాలూప్రసాద్ యాదవ్... పవర్ పంచ్ డైలాగులకు - కడుపుబ్బా నవ్వించే చమత్కారానికి కేరాఫ్ అడ్రెస్. రాష్ట్రీయ జనతాదళ్ అధినేతగానే కాకుండా బీహార్ లు సీఎంగా - కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ... తాను కాలు పెట్టిన ప్రతి చోటా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. పాలనలోనే కాకుండా అవినీతిలోనూ లాలూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. బీహార్నే కాకుండా యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన దాణా స్కాంలో చిక్కుకున్న లాలూ... ఇటీవలే ఆ కేసులో దోషిగా తేలారు. అంతేనా... మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో నేడో - రేపో ఆయన బిర్సా ముండా జైలుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఓ వార్త నిజంగానే షాకింగ్ గా మారిందని చెప్పాలి. అచ్చమైన పల్లెటూరి బైతులా కనిపించే లాలూ... తన ఇంటిలోనే కాకుండా బయట కూడా అదే రీతిన వ్వవహరిస్తారు. అలాంటి లాలూకు ఎలాంటి అనుచరులున్నారో తెలిస్తే మాత్రం షాక్ తింటాం. ఎందుకంటే... లాలూకు జైలు శిక్ష పడిందని - లాలూకు ఇప్పటిదాకా అన్నీ తామై వ్యవహరించామని - ఇకపైనా ఆయనను అంటిపెట్టుకునే ఉంటామని తీర్మానించేసుకున్న ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా లాలూ జైలులో అడుగుపెట్టే కంటే ముందుగానే జైలు లోపలికి వెళ్లిపోయారు.

వినడానికే షాకింగ్ అనిపించేలా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... లక్ష్మణ్ మహతో - మదన్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమపై తామే తమ బంధువుతో కేసులు పెట్టించుకొని లాలూ ప్రసాద్ యాదవ్ కంటే ముందే జైలుకు వెళ్లి అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణ్ మహతో అనే వ్యక్తి లాలూ ప్రసాద్ కు పలు విధాలుగా సాయం చేసేవాడు. ముఖ్యంగా వంట చేయడంతోపాటు లాలూ రాజకీయ క్షేత్రంలో కీలకంగా పనిచేసేవాడు. ఇక మదన్ యాదవ్ అనే వ్యక్తి లాలూ ఎప్పుడు రాంచీ వచ్చినా చాలా హడావుడి చేసేవారు. చురుకుగా లాలూ చేసే పనుల్లో పాల్గొంటూనే లాలూ ఇంటి పనులు చూసుకునేవాడు. లాలూ త్వరలోనే జైలులో అడుగుపెట్టనున్నారనే విషయం గమనించి.. రాంచీలో సుమిత్ యాదవ్ అనే ఓ వ్యక్తితో తాము అతడిపై దాడి చేసినట్లు ఓ పది వేల రూపాయల దొంగతనం చేసినట్లు కేసు పెట్టించుకున్నారు.

అయితే రాంచీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేసేందుకు నిరాకరించగా మరో స్టేషన్ కు వెళ్లి ఎఫ్ ఐఆర్ నమోదు చేయించుకున్నారు. దీంతో వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గత డిసెంబర్ (2017) 23నే బిర్సా ముండా జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వారంతా వీళ్లు మాములోళ్లు కాదని - మహాముదుర్లని - అందుకే అలా చేశారని అంటున్నారు. కాగా ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో శిక్షపడిన లాలూ ప్రసాద్ వారు ఉంటున్న జైలుకే వెళ్లనున్నారు. ఇంత జరిగిందా? అంటే... నిజమేనండీ బాబూ... వారిద్దరు ఇప్పుడు ఉంటున్న జైలులోకే లాలూ అడుగుపెట్టనున్నారు. అంటే ఇంటి వద్ద ఆయనకు చేదోడువాదోడుగా ఉన్న వీరిద్దరూ... ఇకపై జైలులోనే ఆయనతోనే ఉంటారన్న మాట.