December 19, 2018

kids-with-smartphone

ఒకప్పుడు పిల్లలు టీవీ ఎక్కువగా చూస్తున్నారన్న బెంగ పెద్దల్లో కనిపించేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వంతొచ్చింది. తమ పిల్లలు స్మార్ట్ ఫోన్ల మీద ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారని బాధ పడే పేరెంట్స్‌కి.. మరింత ఆందోళన కలిగించే విషయాలు బైటపడ్తున్నాయి. పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ స్మార్ట్ ఫోన్ యూసేజ్ మీద బెంగపడ్డం కొత్తదేమీ కాదు. కానీ.. ఆ విషయంలో ఇంకాస్త సీరియస్‌నెస్ అవసరమంటోంది నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చేయించిన రీసెర్చ్ రిపోర్ట్.

రోజుకు ఏడు గంటలకు మించి స్క్రీన్ మీద స్పెండ్ చేస్తే.. మెదడు పనితీరులో స్పష్టమైన తేడాలొస్తాయట. రెండు గంటలకు మించి స్మార్ట్ ఫోన్ వాడితే.. అటువంటి పిల్లల్లో జిజ్ఞాస తగ్గుముఖం పడుతుందని కూడా చెబుతోందా రిపోర్ట్. పిల్లల స్క్రీన్ టైమింగ్స్‌కి, వాళ్ళ మీద కలిగే దుష్ప్రభావాలకు లంకె ఉందని తేలడంతో.. విస్తరిస్తున్న టెక్నాలజీని చూసి ఈర్ష్య పడ్డమే తప్ప మరేమీ కాదని దెప్పిపొడిచేవాళ్లూ వున్నారు.

టీవీ చూడ్డం, ఫోన్లో మాట్లాడ్డం లాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రమాదం ఏమీ లేదని, వచ్చిన చిక్కంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకంతోనేనని చెబుతున్నారు. 2016లో సగటున రోజుకు ఆరుగంటలు డిజిటల్ మీడియా కోసం స్పెండ్ చేసిన టీనేజర్లు ఇప్పుడు 12 గంటల దాకా తగలేస్తున్నారట. పైగా.. పోర్టబుల్ డివైస్ వినియోగానికి, స్లీపింగ్ డిజాస్టర్స్‌కి కూడా సంబంధముందన్నది మరో ఆందోళనకర అంశం.

ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు.. అందులోంచి పుట్టే బ్లూ లైట్.. మెదడు మీద ప్రభావం చూపుతుందట. ఆలోచన శక్తిని మింగేసే ఈ దుర్లక్షణం.. అత్యంత ప్రమాదకరమని కూడా NIH రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. జీన్ ట్వేన్గ్ అనే ప్రఖ్యాత సైకాలజిస్ట్ మాత్రం.. బెడ్రూమ్ లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో వుంచకూడదని, వాటి వాడకాన్ని రోజుకు రెండు గంటలకు మించకుండా చూడాలని చెబుతున్నారు. సో.. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు దూరంగా పెట్టడం అనేది ఒక తప్పనిసరి విషయం. కానీ.. ఇది కుదిరే పనేనా?