December 19, 2018

keerthy-suresh-rajinikanth

ప్రస్తుతం రజనీకాంత్ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు. ఆయన పెద్దకూతురు వయసు ముప్పై ఆరేళ్లు. ఆయన చిన్నకూతురు వయసు ముప్పై నాలుగేళ్లు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించబోయే సినిమాలో ఆయన సరసన జతకట్టబోతుందంటున్న కీర్తీసురేష్ వయసు ప్రస్తుతం ఇరవై ఆరేళ్లు. ఇదీలెక్క. అరవై ఎనిమిదేళ్ల వయసున్న హీరో సరసన ఇరవై ఆరేళ్ల హీరోయిన్!

కూతురు వయసున్న హీరోయిన్లతో స్టెప్పులేస్తారు.. అనేది హీరోల విషయంలో ముందు నుంచి ఉన్న నానుడి. ఇప్పుడు రజనీకాంత్ విషయానికి వస్తే ఆయన కూతుళ్ల కన్నా పదేళ్ల చిన్న వయసు అమ్మాయి సరసన నటించబోతున్నాడట. ఇదెంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టం.

రజనీకాంత్ ఇటీవలి సినిమాల్లో యంగ్ హీరోయిన్లు అనే కాన్సెప్ట్ లేదు. రోబో పార్ట్ టూలో రజనీకి హీరోయినే లేదు. కాబట్టి సేఫ్. ఇక అంతకు ముందు 'కాలా'లో రజనీకాంత్ ను మధ్య వయసు వాడిగా చూపించేశారు.

రజనీ సరసన ఈశ్వరిరావు వంటి ఆయన వయసుకు తగ్గయ్యే నటీమణిని పెట్టారు. అంతకు ముందు కబాలిలో రజనీకాంత్ ది మధ్య వయసు పాత్రే. లింగాలో నటించింది రజనీ కూతురు వయసు హీరోయిన్లే అయినా.. అప్పటికి ఓకే అనిపించింది.

ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ మాస్ ఎంటర్ టైనర్లో నటిస్తుండటం, ఆయన సరసన పాతికేళ్లు నిండిన అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది అంటుండటం విశేషం.