February 11, 2018

kangana-ranaut-krish

పద్మావత్ సినిమా చూశాక వివాదాల సంగతి పక్కకుపోయింది. సినిమా గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో.... మణికర్ణిక పేరుతో మనోభావాలు మరోసారి వెలుగుచూశాయి.

పద్మావత్ విషయంలో ఏ పాయింట్ పట్టుకుని ఆందోళనలు చేశారో...మణికర్ణిక విషయంలోనూ ఇంచుమించు అదే పాయింట్ పట్టుకుని నిరసనలు చేపట్టారు. అల్లా వుద్దీన్ ఖిల్జీ-పద్మావత్ మధ్య ఏవో సీన్స్ ఉన్నాయంటూ నానా గందరగోళం చేశారు. ఇప్పుడు మణికర్ణికలోనూ ఆమెకు- ఓ బ్రిటీష్ వ్యక్తికి మధ్య సంబంధం ఉందని చూపిస్తున్నారంటూ హడావుడి చేస్తున్నారు.

తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ కథతో రూపొందుతున్న 'మణికర్ణిక' సినిమాలో చరిత్రను పక్కదోవ పట్టిస్తున్నారని సర్వ బ్రాహ్మణ్ మహాసభ ఆరోపిస్తోంది. ఓ బ్రిటిషర్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని.. చిత్రంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌కు ఓ బ్రిటీష్ వ్యక్తికి మధ్య సంబంధం ఉన్నట్లుగా చూపబోతున్నారనేది సర్వ బ్రాహ్మణ్ మహాసభ ఆరోపణ. ఈ మేరకు చిత్ర బృందానికి లేఖ పంపామన్నారు. మరోవైపు సర్వబ్రాహ్మణ్ మహాసభకు మద్దతుగా ఉంటామని కర్ణిసేన స్థాపకుడు లోకేంద్ర సింగ్‌ కల్వి చెప్పారు. బ్రాహ్మణులకు ఇబ్బందులు ఎదురైతే రాజ్‌పుత్‌లు ఊరుకోరని స్పష్టం చేశారు.

ఈ హిస్టారికల్ మూవీలో చరిత్రను వక్రీకరించే సన్నివేశాలు లేవని ఇప్పటికే స్పష్టం చేశాడు నిర్మాతల్లో ఒకరైన కమల్ జైన్. రాణి లక్ష్మీబాయ్‌ రోల్‌ని గౌరవప్రదంగా చూపిస్తున్నామని, ఇందులో ఆమె క్యారెక్టర్‌ని అభ్యంతరకరంగా చూపించడంలేదని, లవ్‌ ఎఫైర్ అన్నమాటకు ఆస్కారమే లేదన్నాడు. అయినప్పటికీ సర్వ బ్రాహ్మణ మహాసభ వెనక్కు తగ్గడం లేదు.

అయితే ఈ వివాదంపై మరికొందరి స్పందన వేరేలా ఉంది. ఆ కాలంలోనూ సైన్యాన్ని కూడగట్టి, ఎంతో బలమైన బ్రిటీష్ వాళ్లకు ఎదురుతిరిగిన సాహసి, భారతీయ మహిళ తెగువకు ప్రతీక, పైగా ఒక రాణికి- అప్పటి బ్రిటీష్ పాలకులకు మధ్య పంచాయితీ. అంతే కానీ ఇందులో కులం పాత్ర ఏముంది?..ఇందులో వివాదం చేయడానికేముంది? ఆమె సాహసాన్ని చూడకుండా ఏమూలో ఏదో పాయింట్ ఉందంటూ ఆందోళనలు చేయడం ఎంత వరకూ సమంజసం అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

పద్మావత్ సినిమా విడుదల ఆపేందుకు కర్ణిసేన ఆందోళనలతో హోరెత్తించాయ్. దీపిక తలకు వెలకట్టారు. ఎన్ని జరిగినా దీపిక అస్సలు తగ్గలేదు. పైగా బాలీవుడ్ మొత్తం ఆమెకు అండగా నిలబడింది. దీపిక బచావో పేరిట సంతకాల సేకరణ చేపట్టి ప్రధానికి పంపారు. అదే సమయంలో బీటౌన్ మొత్తం ఓ కుటుంబంలా కలసిపోయింది. కంగనా మాత్రం సంతకం చేయకపోవడం హాట్ టాపిక్ అయింది.

ఓ స్టార్ హీరోతో వివాదం వచ్చినప్పుడు... తనను ఎవరూ సపోర్ట్ చేయలేదని అలిగింది. తానొక్కదాన్నే పోరాడాను కానీ బాలీవుడ్‌లో ఏ ఒక్కరూ తన విషయంలో స్పందించలేదని కంగనా బాధపడింది. అందుకే వాళ్లంతా కలసి చేస్తున్న ఉద్యమానికి తానెందుకు మద్దతివ్వాలని ప్రశ్నించింది.

దీపికకు కంగనా సపోర్ట్ చేయనంత మాత్రనా వచ్చిన నష్టంలేదు. ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్‌గా నిలిచింది. ఆ సమయంలో దీపిక తెగువ చూసి మురిసిపోని వారూ లేరు. కానీ కంగనా వరకూ వచ్చేసరికి ఇప్పుడేం జరుగుతుందన్నదే హాట్ డిస్కషన్. ఎందుకంటే పద్మావత్ విషయంలో ఏ పాయింట్‌పై వివాదం రేగిందో సేమ్ టు సేమ్ మణికర్ణిక సినిమాకు సంబంధించి అదే ఇష్యూ జరుగుతోంది. ఈ వివాదాలు కూడా ఓ రేంజ్‌కి వెళితే... కంగనా సినిమా పరిస్థితేంటి? మేమున్నామంటూ మద్దతిచ్చేదెవరు?.

మరోవైపు పద్మావత్‌కు ప్లస్ పాయింట్ దీపికతో పాటూ సంజయ్ లీలా భన్సాలీ. బాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్ కావడంతో తనకూ ఫుల్ సపోర్ట్ లభించింది. కానీ మన దర్శకుడు క్రిష్‌కి అక్కడున్న ఆదరణ ఏమాత్రం?. తెరెకెక్కించినవి వేళ్లపై లెక్కెట్టే సినిమాలే అయినప్పటికీ తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు క్రిష్. కానీ బాలీవుడ్‌లో పెద్దగా ఆదరణ లేదు. పైగా కంగనా హీరోయిన్..ఇలాంటి సమయంలో క్రిష్ సినిమాకు వివాదాలు క్లియరయ్యేదెలా?.

సాధారణంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు తీయడమంటే...కత్తిమీద సామే. చరిత్రను వక్రీకరిస్తే విమర్శలు తప్పవు, అలాగని యథాతథంగా తీస్తే డాక్యుమెంటరీ అని ప్రేక్షకులు సినిమాకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని చిత్రం తీస్తేనే అది అన్ని వర్గాలవారి మన్ననలు పొందుతుంది. 'పద్మావత్‌' విషయంలో అదే జరిగినా సినిమా విడుదలయ్యాక... అబ్బే ఇందులో ఇబ్బందికర అంశాలేవీ లేవని ఒప్పుకున్నారు. పైగా రాజపుత్రుల మనోభావాలు మరింత పెంచేలా ఉందని ప్రశంసించారు. అయితే చిక్కు ముడులన్నీ విప్పుకుని థియేటర్లలోకి వచ్చాక పద్మావత్‌పై కర్ణిసేన అభిప్రాయం మారింది. ఈ లెక్కన మణికర్ణిక కూడా థియేటర్లలోకి వస్తేనే అభిప్రాయాలు మారుతాయ్. కానీ అంతకు ముందు జరిగే వివాదాలను నెట్టుకొచ్చేదెలా?.

ఏప్రిల్‌ 27న ఈ సినిమా విడుదలవుతుందని మణికర్ణిక యూనిట్ ముందుగా ప్రకటించినా....వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా పడింది. ఇప్పటికైతే వివాదాలు గట్టిగానే ఉన్నాయ్.. మరి దర్శకుడు-నిర్మాత జోక్యంతో సర్దుమణుగుతుందో....మరిన్ని మలుపులు తిరుగుతుందో... ఫైనల్‌గా మణికర్ణిక ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.