April 16, 2017

jithender-reddy-MP-17

గిరిజనుల రిజర్వేషన్లను అడ్డుకోవాలనే కుట్రలను మానుకోకపోతే బీజేపీకి, ఆ పార్టీ నాయకులకు పుట్టగతులు ఉండవని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఒక్క గిరిజనులే కా క రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేక్లే కొన్ని వర్గాలకు రిజర్వేషన్ల శాతం పెంపునకు పెంచేందుకు సీఎం అంగీకరించారన్నా రు. గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వసాహసోపేత నిర్ణయాలను బీజేపీ అడ్డుకుంటే తాముకూడా అక్కడ కేంద్రం నిర్ణయాలను సీఎం ఆదేశాలతో అడ్డుకుంటామన్నారు.

జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు, మైనారిటీల్లో పేదలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించడంపై గిరిజన, మైనారిటీ నాయకులు భగ్గుమన్నారు. గిరిజనుల చిరకాల స్వప్నమైన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు అడ్డుపడి కుట్రలు చేస్తే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారన్నారు.మా పిల్లల భవిష్యత్తుకు మేలు చేసే ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటే ఖబడ్దార్.. భౌతికదాడులకు దిగడానికి వెనుకాడబోం అని వారు హెచ్చరించారు. బీజేపీని గిరిజన వ్యతిరేకపార్టీగా వారు అభివర్ణించారు.

తెలంగాణకు చెందిన ఏడు గిరిజనమండలాలను పోలవరంలో ముంచిన చరిత్ర బీజేపీదేనని, అది చాలనట్టు ఇపుడు గిరిజనుల రిజర్వేషన్లకు కూడా అడ్డం పడుతున్నదని వారు పేర్కొన్నారు. గిరిజనులుగా ఈ దుర్మార్గాన్ని సహించేది లేదని, బీజేపీ కార్యాలయాలు ముట్టడిస్తామని, బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలకు దిగుతామని వారు తెలిపారు. రిజర్వేషన్లను అడ్డుకునే పార్టీలు ముస్లిం, గిరిజన వ్యతిరేక పార్టీలుగా నిలిచిపోతాయని గిరిజన, ముస్లిం ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ఇదిలాఉంటే ఆదివారం పలు గిరిజన సంఘాలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.