April 16, 2017

సూపర్ స్టార్ రజినీకాంత్ బయట కనిపించే తీరుకు.. తెరమీద కనిపించే తీరుకు అసలు పోలికే ఉండదు. నల్లటి మేని ఛాయ.. బట్ట తల.. తెల్లటి గడ్డం.. మొత్తం ఆయన తీరే వేరుగా ఉంటుంది. ఆయన్ని మామూలుగా చూస్తే హీరోలా కాదు కదా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సరిపోడేమో అనిపిస్తుంది. కానీ ఆయన తెరమీదికి వచ్చేసరికి మేకోవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని తెరమీద అలా చూపించే మేకప్ మ్యాన్లను అభినందించాల్సిందే.
ఐతే ఎప్పుడూ హెవీ మేకప్‌తో కనిపించే రజినీని ‘కబాలి’లో మినిమం మేకప్‌తో కొత్తగా చూపించాడు దర్శకుడు పా.రంజిత్. అందులో నెత్తిన జుట్టు పెట్టించుకోవడం మినహాయిస్తే రజినీ దాదాపుగా ఒరిజినల్ లుక్‌లోనే కనిపించాడు. ముఖానికి పెద్దగా మేకప్ వేయలేదు. గడ్డం అలాగ తెల్లగా ఉంచేశాడు. ఐతే ఈ లుక్‌లోనూ రజినీ స్టైల్ మాత్రం మిస్సవలేదు. ఈ లుక్కు రెస్పాన్స్ అదిరిపోయింది.
ఇప్పుడు పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు రజినీ. మేలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రంలో రజినీ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట. ఈసారి రజినీని దాదాపుగా ఒరిజినల్ లుక్‌లోనే చూపించబోతున్నాడట రంజిత్. రజినీ ఇందులో కొంచెం బట్టతలతో కనిపించబోతున్నాడట. ఐతే పూర్తిగా కాకుండా కొంచెం బాల్డ్ హెడ్‌తో దర్శనమిస్తాడని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ లుక్ అయితే నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. ఇది మాఫియా నేపథ్యంలో ముంబయి బ్యాక్ డ్రాప్లో సాగే సినిమా అని సమాచారం. మెజారిటీ షూటింగ్ ముంబయిలోనే చేస్తారట. ఈ చిత్రంలో విద్యాబాలన్ కథానాయికగా నటించే అవకాశముంది.