November 13, 2017

rajamouli-17-11-13

‘బాహుబలి’ సినిమాకు పారితోషకం కాకుండా లాభాల్లో వాటా తీసుకున్నట్లుగా రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనే కాదు.. చాలా ఏళ్ల నుంచి తాను తీసే సినిమాలకు లాభాల్లో వాటానే తీసుకుంటున్నాడు జక్కన్న. అతడి కెరీర్లో ఫెయిల్యూర్ అన్నదే లేదు. రాజమౌళి ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతోంది. కాబట్టి లాభాల్లో వాటా కింద రాజమౌళి కనీసం వంద కోట్లయినా సంపాదించి ఉంటాడని అంచనా. రాజమౌళి మాత్రమే కాదు.. అతడి కుటుంబ సభ్యులు కూడా ఒక ప్యాకేజీ కింద డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఈ ఆదాయాన్నంతా వాళ్లు ఏం చేస్తున్నారు.. ఖర్చులు పోను మిగిలే డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు.. అన్నది ఆసక్తికరం.

ఐతే రాజమౌళి.. ఇతర కుటుంబ సభ్యులు భూముల మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలో రాజమౌళి భారీ స్థాయిలో భూమి కొని ఫామ్ హౌస్ కట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా అనంతపురం.. విజయనగరం జిల్లాల్లోనూ రాజమౌళి భూములు కొంటున్నట్లు సమాచారం. ఇటీవలే రాజమౌళి అనంతపురం జిల్లాకు కూడా వెళ్లివచ్చాడట. అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రాజమౌళి కనిపించాడట. ఇదంతా భూముల కొనుగోలు.. రిజిస్ట్రేషన్ పనుల్లో భాగమే అంటున్నారు. భూమి మీద పెట్టే పెట్టుబడి అన్నింటికంటే సురక్షితమైందని.. ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేది కూడా అదేనని అంటారు. రాజమౌళి కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.