October 07, 2017

pawan-kalyan-17-10-7

జనసేన కొద్దికొద్దిగా లైన్లో పడుతోంది! కొన్నాళ్ల నుంచి మిగతా రాజకీయ నాయకుల మీద కామెంట్లు పోస్ట్ చేయడం మానేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నిశ్శబ్దం వీడినట్లు కనిపిస్తోంది. అశోక్ గజపతి రాజుకి పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు.. మంత్రి పితానికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలీదు.. సంతోషం..! అంటూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మంత్రి పితాని సత్యనారాయణ.. పవన్ కళ్యాణ్ కి రాజకీయ పరిజ్ఞానం లేదని, రాణించడం కష్టమని అర్థం వచ్చేలా మాట్లాడారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా 'నేను సినిమాలు పెద్దగా చూడను.. పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు' అంటూ సూటిగా చెప్పేశారు. ఈ రెండు కామెంట్లకు కలిపి.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కంబైన్డ్ గా కౌంటర్ ఇచ్చేశారు. ఇకముందు ఏ పొలిటీషియన్ అయినా తన మీద సెటైర్లు వేస్తే ఊరుకునేది లేదని పవన్ ఈవిధంగా క్లారిటీనిచ్చారా?

గత ఎన్నికల్లో భుజంభుజం కలిపి నడిచిన తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య ప్రస్తుతమున్న సంబంధం ఏమిటన్న క్లారిటీ కూడా ఈ ట్వీట్ ద్వారా వచ్చేసింది. ఒకవైపు పాలనాపరమైన నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ కి సైతం చంద్రబాబు ఒక పీట వేసి కూర్చోబెడుతున్నారు. ఎన్నికలున్నా లేకపోయినా ఇద్దరూ అడపాదడపా భేటీ అవుతున్నారు. కర్ర విరక్కుండా పాము చావకుండా జనసేనతో చంద్రబాబు తెలివిగా వ్యవహరిస్తున్నారని కాంప్లిమెంట్లు కూడా పడుతున్నాయి. కానీ.. తన దగ్గరున్న మిగతా మంత్రులతో పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు ఆయనే వేయిస్తున్నారన్న అనుమానాలక్కూడా తావిస్తున్నారు. దీంతో.. టీడీపీ లీడర్లకు, క్యాడర్లకు జనసేన మీద వుండే అసలు అభిప్రాయం ఏమిటన్న క్లారిటీ మిస్సవుతోంది. ఈ క్రమంలోనే 'తెలుగు తమ్ముళ్ళారా 'జనసేన'ను తేలిగ్గా తీసుకోకండి..' అంటూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ ద్వారా హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. కానీ.. జనసేన నిర్మాణం జరుగుతున్న తీరు, అందులోని వేగం మీద ఒక్క తెలుగుదేశానికే కాదు.. మొత్తం రాజకీయ వర్గాలన్నిటిలోనూ సందేహాలున్నాయి. మాటల్లోనో, ట్వీట్లతోనో కాకుండా.. ఫిజికల్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది. జనసేన బలం ఇదీ.. అనే క్లారిటీ జనంలో కలిగేంతవరకు.. ఈ గడబిడ తప్పదేమో!