
''సినిమాల ఎంపికలో నాకు తెలీయకుండానే కొన్ని తప్పులు చేసాను. ఆ తప్పులే చేయకుండా ఉంటే ఈ రోజున నా స్ధానం వేరే విధంగా ఉండేది. ఉదాహరకు బాద్షా చిత్రం. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను అందులో చేసాను. నిజానికి ఆ పాత్రను నేనే చెయ్యాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెయ్యచ్చు. ఇక ముందు అలాంటి సినిమాలు చెయ్యను'' అని హీరో నవదీప్ అన్నారు. తాజాగా.. రామ్చరణ్ నటించిన ధృవ సినిమాలో హీరోకు సపోర్టింగ్ కేరెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేసిన నవీదీప్.... కానీ, అతడు మాత్రం బాద్షా సినిమాలో తారక్ పక్కన విలన్గా చేసి ఉండాల్సింది కాదని అంటున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా స్క్రిప్ట్ దశలో.. తన కేరెక్టర్ బాగా వర్కవుట్ అవుతుందని భావించానని, తీరా సినిమా చూశాక అరె..అనవసరంగా చేశానే అని అనిపించిందని అన్నాడు.
విలన్ పాత్రలకు బదులుగా ఆర్య-2లో చేసిన నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలకైనా ఓకే గానీ, బాద్షా సినిమాలోని పాత్రలు మాత్రం అనవసరమని అన్నాడు. అయితే.. బాద్షా సినిమా సూపర్ హిట్టయితే నవదీప్ నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చి ఉండేవి కావని, వేరేలా మాట్లాడేవాడని ఫిల్మ్నగర్లో చర్చించుకుంటున్నారు. నవదీప్ మాట్లాడుతూ... ''ఏ వ్యక్తికైనా గడిచిన ప్రతిరోజూ ఓ పాఠం నేర్పిస్తుంది. దాన్ని గుర్తించి ఇంతకు ముందు చేసిన తప్పుల్ని మరలా చేయకపోవడమే తెలివైన పని. గత సినిమాలు నేర్పిన అనుభవంతో నేను ముందుకు సాగుతున్నా'' అని అంటున్నారు నవదీప్.
మల్టీస్టారర్ చిత్రాల్లో చేయడానికి అభ్యంతరాలు ఏమీ లేవని, ఏ ఇద్దరి హీరోలు ఒక చిత్రంలో నటించినా, వారిద్దరికీ మంచి పేరు రావడం సహజమేనని ఆయన అన్నారు. ఫలానా హీరోతో చేస్తే తనకు పేరు రాకుండా వేరే హీరోకు స్టార్డమ్ వస్తుందన్న భావన ఎప్పుడూ తనలో ఉండదని, అటువంటి ఆలోచన కూడా తనకుండదని, తన ముందున్న చిత్రాలను వీలైనంత సమర్థవంతంగా మంచి చిత్రాలుగా రూపొందించుకుని, నటుడిగా నాలుగు మార్కులు సంపాదించుకోవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.
నెగటివ్ పాత్రల గురించి ప్రస్తావిస్తూ ''పెద్ద హీరోల సినిమాల్లో నెగటివ్ పాత్రలు చేయడంలో నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ పాత్రను నేను చేయడం వల్ల ప్రత్యేకంగా అనిపించాలి. 'ఆర్య-2', 'ఓ మై ఫ్రెండ్' లాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే. కొన్ని సినిమాల్లో నటించి పొరపాటు చేసిన మాట వాస్తవమే. కాకపోతే ఆ సినిమాలు విడుదలయ్యాక నాకు విషయం బోధపడింది.'' అని తెలిపారు.