Nara-Brahmini-16-12-27

ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో తన పార్టీ నేతల సమావేశంలో 175 అసెంబ్లీ సీట్లకు గానూ అన్నింటికీ అన్నీ గెలవాలని పిలుపునిస్తూ ఉన్నాడు. అలాగే తన అనుకూల మీడియాలో కూడా పార్టీ వెలిగిపోతోందని బాబు ప్రచారం చేయించుకుంటున్నారు. అయినా సంతృప్తి లేక.. పథకాల వారీగా సర్వేలు అంటూ ఇంకో రకమైన హడావుడి చేస్తున్నాడు ఏపీ సీఎం. బాబుగారి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంటున్న ఈ సర్వేలో మరో ప్రహసనం. అసలు చేయనే చేయని డ్వాక్రా రుణమాఫీ విషయంలో కూడా అరవై శాతం మంది సంతృప్తి గా ఉన్నారని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది.

అంటే.. హామీగా ఇచ్చి అమలు చేయని డ్వాక్రా రుణమాఫీ విషయంలో అంతమంది సంతృప్తిగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం అంతర్గత సర్వే ఒకటి కూడా ప్రస్తావించుకోవచ్చు. ఆ మధ్య చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ఒక థర్డ్ పార్టీతో చేయించుకున్న సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ వస్తే టీడీపీ కేవలం 57 సీట్లకు పరిమితం అవుతుందని తేలిందనే వార్తలు వచ్చాయి.

రెండున్నరేళ్ల పాలనకు గానూ చంద్రబాబు సంపాదించుకున్న వ్యతిరేకతతో తెలుగుదేశం పరిస్థితి అక్కడి వరకూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సర్వే సంగతలా ఉంటే.. చంద్రబాబు పాలనలో సగ భాగం పూర్తి అయిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ గడిచిన కాలంతో పోల్చుకుంటే మిగిలి ఉన్న కాలం తక్కువ!

ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉంది? ఇప్పటి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు క్యాష్ చేసుకుంటోంది? అనే అంశాల గురించి జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఒక థర్డ్ పార్టీ జరిపిన ఈ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెష్ పార్టీ హవా కనిపిస్తోంది.

దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 175 సీట్లకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిష్టం గా 97 స్థానాల్లో జయకేతనం ఎగురవేసే అవకాశాలున్నాయని తేలింది. రెండున్నరేళ్ల పాలన అనంతరం.. చంద్రబాబు తీరుపై ఒక అంచనాకు వచ్చిన ప్రజానీకం ఇప్పుడు అవకాశం వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ అధ్యయనం లో తేలింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల వారీగా చూసుకుంటే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా నిలిచిన గోదావరి - అనంతపురం జిల్లాల్లో టీడీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.

అనంతపురం వంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం రుణమాఫీ హామీలే. అయితే వాటిని అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో.. రైతు కుటుంబాలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయి. ఇక గోదావరి జిల్లాల్లో అధికంగా ఉండే కాపులపై రిజర్వేషన్ల హామీ బలంగా పని చేసింది. ఇక ఆ విషయంలో చంద్రబాబు తీరు సరేసరి! కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా..ఆ విషయంలో పోరాడుతున్న వారిని అణగదొక్కడానికి బాబు శతథా ప్రయత్నిస్తున్నాడు. దీంతో.. అక్కడా ఎదురుదెబ్బ తప్పదని ఈ అధ్యయనం తేల్చింది.

అయితే విశాఖ వంటి ప్రాంతాల్లో మాత్రం తెలుగుదేశం పరిస్థితి కొద్దిగా బెటర్ గానే ఉందని ఈ సర్వే పేర్కొనడం విశేషం. అయితే.. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం నిలబడటానికి ఆ బలం సరిపోదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు తెలుగుదేశం+ బీజేపీ + జనసేనలు మరోవైపు అనే బలాబలాల మీదనే ఈ సర్వే ను నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం - బీజేపీ - జనసేనలు కలిసి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. వైకాపా 97 పై స్థాయి స్థానాల్లో విజయం సాధిస్తుంది ఆ కూటమి 70 స్థానాలకు పరిమితం అవుతుందని ఈ అధ్యయనం లో తేలింది.

ఏ పార్టీకి ఎవరినీ రంజింపజేయడానికి.. కాకుండా రాజకీయ పరిస్థితులపై ఆసక్తితో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడానికి.. అత్యంత శాస్త్రీయంగా జరిగిన ఈ సర్వే ఫలితాలు నిస్సందేహంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉత్సాహాన్ని కలిగించేవే!