December 19, 2018

NTR-nandmuri-suhasini-12

ఎన్టీఆర్‌ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలలో ప్రజా కూటమి తరఫున ప్రచారం చేయకపోవడం, కనీసం తన అక్క పోటీ చేసిన కుకట్‌పల్లి నియోజికవర్గం పరిసరాలయినా చుట్టి రాకపోవడం, అంతకుమించి కనీసం ఒక ట్వీట్‌ అయినా వేసి అభిమానులని చైతన్య పరచకపోవడం తెలుగుదేశం శ్రేణులని, నందమూరి వంశాభిమానులని తీవ్రంగా కలచి వేసింది.

ఎన్టీఆర్‌ ప్రచారానికి దూరంగా వుండడం వల్ల మళ్లీ బాలకృష్ణ అతని పట్ల కినుక వహించాడని, మరోసారి సంబంధాలు బలహీనపడ్డాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తారక్‌ తన ఫ్యామిలీ కోసమయినా పంతం ఎందుకు వీడలేదు. అంతిమంగా నందమూరి సుహాసిని ఓటమి పాలవడంతో తారక్‌ మంచి డెసిషన్‌ తీసుకున్నాడని అంటున్నారు. కాకపోతే ఓడిపోతుందని ఎన్టీఆర్‌కి ముందే తెలియదుగా? తెలుసంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్టీఆర్‌కి అత్యంత ఆప్తుడైన ఒక మిత్రుడు సర్వే చేసి కుకట్‌పల్లిలో టీడీపీ గెలిచే అవకాశం లేదని ఎన్టీఆర్‌కి చేరవేసాడట.

పైగా ప్రచారానికి వెళితే తన డైహార్డ్‌ అభిమానులు హర్ట్‌ అయ్యే అవకాశముందని, చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలనే అభిప్రాయం అంతటా వుండడం వల్ల ప్రచారానికి వెళ్లినా ప్రయోజనం వుండదని స్నేహితుడు ఖచ్చితంగా చెప్పడంతో అటు ఎన్టీఆర్‌ మాత్రమే కాకుండా కళ్యాణ్‌రామ్‌ కూడా ప్రచారానికి దూరంగా వుండిపోయాడట. ఇదిలావుంటే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఆడియో వేడుకకి తారక్‌ని ఆహ్వానించేదీ, లేనిదీ చూస్తే బాలయ్య ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడనేది అర్థమవుతుందని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.