April 16, 2017

malala-yusuf-17-4-16

పాకిస్థాన్‌కు, ఇస్లాంకు ఉన్న కీర్తిప్రతిష్ఠలను మంటగలుపుతున్నది పాకిస్థానీలేనని నోబెల్ విజేత మలాలా యూసఫ్‌జాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ దూషణ చేసినట్లు ఆరోపిస్తూ ఓ విద్యార్థిని భారీ జన సమూహం హతమార్చడం దారుణమన్నారు.

ఖైబర్ పష్తూన్‌లోని అబ్దుల్ వాలీ ఖాన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్న మషాల్ ఖాన్‌ను అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా కొట్టి, కాల్చి చంపారు. మషాల్ ఖాన్ దైవ దూషణను, అహ్మదీయ విశ్వాసాలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నాడని దుండగులు ఆరోపించారు.

దీనిపై పాకిస్థానీ ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్ (19) స్పందించి, ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘మషాల్ ఖాన్ మరణ వార్త నాకు తెలిసింది. ఈ సంఘటన పూర్తిగా ఉగ్రవాదం, హింసాత్మకం. మృతుడి తండ్రి శాంతియుతంగా, సహనంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ఆయనతో నేను మాట్లాడాను. ఆయన సందేశాన్ని నేను ప్రశంసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఇస్లామాఫోబియా ఉందని, మన దేశానికిగల కీర్తి ప్రతిష్ఠలను ఇతర దేశాలు చెడగొడుతున్నాయని ఆరోపిస్తూ ఉంటామని మలాలా గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు, ఇస్లాంకు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నది స్వయంగా మనమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పరువు పోవడానికి బాధ్యత మనదేనన్నారు. ‘‘ఇది మషాల్ ఖాన్‌కు అంత్యక్రియలు కాదు, మన మత బోధనలకు అంత్యక్రియలు. శాంతి, సహనాలను బోధిస్తున్న ఇస్లాం బోధనలను మనం మర్చిపోతున్నాం’’ అని మలాలా పేర్కొన్నారు.

2014 నోబెల్ శాంతి బహుమతిని భారతదేశానికి చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థితో కలిసి మలాలా పంచుకున్నారు.