KTR-pawan-kalyan-17-1-19.

తెలుగు రాజ‌కీయాల్లో కొత్త వార్ మొద‌లైందని అంటున్నారు. తెలంగాణ ఐటీ, చేనేత‌ శాఖా మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వ‌ర్సెస్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న రీతిలో ఈ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మొద‌లైంద‌ని చెప్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల చేనేత‌కు చేయుత‌నిద్దాం పేరుతో మంత్రి కేటీఆర్ ప్రచారం మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటు అసెంబ్లీలో, అటు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయించి దుస్తులు కొనిపించేలా చేయ‌డంలో మంత్రి కేటీఆర్ స‌ఫ‌లం అయ్యారు. అంతేకాకుండా సినీ న‌టులు నాగార్జున దంప‌తులు స‌హా క‌మ‌ల్ హాస‌న్‌, రానా ద‌గ్గుబాటి, మంచుల‌క్ష్మీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను చేనేత వస్త్రాలు ధ‌రించాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు.

మంత్రి కేటీఆర్ పిలుపున‌కు స్పంద‌న‌గా ఈ సినీ ప్ర‌ముఖులంతా వ‌స్త్రాలు ధ‌రించ‌డంతో బాగానే పాపుల‌ర్ అయింది. అయితే ఈ వార్ లోకి ఇపుడు ప‌వ‌న్ వ‌చ్చి చేరారు. తాజాగా హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో ఏపీ, తెలంగాణలో ఉన్న ప‌లు చేనేత సంఘాల నేత‌లతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చేనేత నాయ‌కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలిచావులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత రెండున్నర సంవత్సరాలలో ఒక్క తెలంగాణాలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

నేత పని గిట్టుబాటు కాక మరే ఇతర పని చేతకాక చేనేతకార్మికుడు తనువు చాలిస్తున్నాడని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పారు. వచ్చేనెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్ క‌ళ్యాణ్ ను కోరారు. అందుకు ప‌వ‌న్‌ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని చేనేత కార్మికుల కష్టాలను విని చలించిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీకారం తెలిపారు.

కాగా మంత్రి కేటీఆర్ వ‌ర్సెస్‌- ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింద‌ని చెప్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చేనేత‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ముందున్న కేటీఆర్‌ను ధీటుగా ప‌వ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అవ‌డం కొత్త యుద్ధానికి వేదిక‌గా మారుతుంద‌ని అంటున్నారు.