January 12, 2018

Jai-Simha-Movie-Review

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ లో కొంచెం సెంటిమెంటు ఉంది. కానీ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ పాత తరంకు చెందిన వాడు కావడమే కాకుండా ఈయనకు ఎన్నో ఏళ్ళుగా ఒక్క హిట్ సినిమా లేకపోవడం అలాగే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో 'లింగా' లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా చేయడంతో ఈ సినిమాకు సహజంగా బాలకృష్ణ సినిమాలకు ఉండేంత బజ్ రాలేదు. కానీ టైటిల్ లో సింహా ఉండడం బాలకృష్ణకు ఒక సెంటిమెంట్ అవడం అలాగే అతనికి ఉన్న మాస్ కమర్షియల్ ఇమేజ్ తో ఈ సినిమా పట్ల ఫ్యాన్సుకు ఆసక్తి పెరగడం సహజమే.

కానీ దర్శకుడు మరీ పాత సినిమా ఫార్ములా నే ఉపయోగించడం అందులోనూ బాలకృష్ణ 'సమర సింహ రెడ్డి' సినిమా నుంచి ఉండే అదే ట్విస్ట్, సినిమాలో హీరో అజ్ఞాతంలో చాలా సాధారణ మనిషిలా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు కానీ ఆయనకు అదిరిపోయే వయలెంట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సెకండ్ హఫ్ లో అయన ఎందుకు ఇలా అజ్ఞాతంగా ఉండాల్సి వస్తుందో తెలిసి పోయి ఆయన దుర్మార్గుల్ని తుద ముట్టించి కథ సుఖాతం అయ్యే కథలు బాలకృష్ణ కెరీర్ లో 70 శాతం ఇలాంటివే కావడం విచిత్రం. నిజానికి కొన్ని సార్లు హిట్ అయిన ఈ ఫార్ములాను బాలకృష్ణ పై అదే పాయింట్ తో దాని చుట్టూ కథ వ్రాసి పడేసి సింపుల్ గా డబ్బులు దండుకోవాలనుకోవడం నిజానికి బాలకృష్ణ ఇమేజ్ ను ఈ దర్శకులు మోసం చేసి దోపిడీ చేయడమే అవుతుంది.

ఈ సినిమా కూడా ఇదే పాయింట్ తో మొదలవుతుంది. బాలకృష్ణ ఒక చిన్న పసికందుతో తమిళ నాడు కు చెందిన కుంభకోణం అనే పట్టణంలో మురళీమోహన్ అనే ఆలయ ధర్మ కర్త ఇంట్లో డ్రైవర్ గా ఉంటూ తన కొడుకును జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాడు. ఇక్కడ కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ కు ఆలయ పూజారీ కు ఘర్షణ జరిగితే అందులో ఆ పోలీస్ బారి నుండి బ్రాహ్మణులను కాపాడతాడు బాలకృష్ణ. ఈ విషయాన్ని టీవీ లో చూసిన అశుతోష్ రాణా అనే వైజాగ్ కు చెందిన గూండా రాజకీయ నాయకుడు (మరణ శిక్ష ఖరారైన ఖైదీ) పాత పగతో బాలకృష్ణ ను చంపాలని రగిలి పోతుంటాడు.

వైజాగ్ లో చిన్న నాటి స్నేహితురాలైన నయనతార ను గాఢంగా ప్రేమిస్తాడు బాలకృష్ణ. కానీ ఆ ప్రేమ సఫలం అవుతుందా లేదా? అశుతోష్ రాణా కు బాలకృష్ణకు ఎందుకు వైరం? బాలకృష్ణ అతనితో ఎలా పోరాడి తన కొడుకును రక్షించుకుంటాడు అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ఈ సినిమా కథ మనకు ఎంతో పరిచయమైనదే అయినా ఈ సినిమా ను తెరకెక్కించడంలో దర్శకుడు రవి కుమార్ ఇప్పటి జెనరేషన్ కు మెప్పించే ఒక్క సీన్ కూడా ప్రయత్నించ లేదు. బ్రహ్మానందం కామెడీ ఈ దర్శకుడు తీసిన చంద్రముఖిలో వడివేలు తన భార్య రజినీ ల మధ్య అఫైర్ నడుస్తుందేమో అని బాధ పడే సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేయడం చాలా శోచనీయం. నిజానికి బ్రహ్మానందం కామెడీ విపరీతంగా బోర్ కొడుతుంది. పగ ప్రతీకారం పాయింట్ కోసం విలన్ కు ఎక్కువ సన్నివేశాలు పెంచి ఇద్దరి మధ్య ఘర్షణ ఉంటే సీన్ రక్తి కెక్కుతుంది. చాలా వీక్ విలనీ సినిమాకు ఒక మైనస్ పాయింట్. ఈ సినిమాకు ఏదైనా ప్లస్ పాయింట్ ఉంటె అది కేవలం బాలకృష్ణ చేసిన మెచూర్ నటన మాత్రమే. నయనతార కూడా బాగా నటించింది.

బాలకృష్ణ నయనతారల నడుమ కెమిస్ట్రీ బాగున్నా పాత్రల మధ్య స్క్రీన్ టైం చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ సీన్లతో సెంటిమెంటు అలాగే పొడిగించిన సేమ్ క్లైమాక్స్ తో సినిమా పై ఆసక్తి సన్నగిల్లేలా చేస్తుంది. చిరంతన్ భట్ సంగీతం యావరేజ్ గా ఉంది. సి.రామ్ ప్రసాద్ కెమెరా బిలో యావరేజ్. టెక్నీకల్ గా పెద్దగా రిచ్ గా ఖర్చు చేసినట్టు కలర్ ఫుల్ గా అనిపించదు.

ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. ఈ టైప్ పాట కథ సెంటిమెంటు, మసాలా సినిమా బి, సి సెంటర్ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఇప్పటి పోష్ యూత్ సిటీ ప్రేక్షకులకు నచ్చే అవకాశం చాలా తక్కువ.

- పర్వేజ్ చౌదరి