January 12, 2018

Gang-Movie-review

హిందీలో విజయం సాధించిన అక్షయ్ కుమార్ ‘స్పెషల్ 26’ సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమా ను యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తమిళ నేటివిటీకి సరిపోయే లా చాలా మార్పులు చేసి పూర్తి తమిళ సినిమా అనిపించేలా చేయడానికి చాలా శ్రమించాడు. నిజాయితీగా చెబితే ఇతను చేసిన మార్పుల వల్ల సినిమాలో ఎండ్ సీరియస్ నెస్ కొంచం తగ్గింది. బహుశా దక్షిణాది సినిమా హీరో కధలో చేసే క్రైం కు జస్టిఫికేషన్ ఇవ్వకపోతే ఇక్కడి ఫ్యాన్స్ ఒప్పుకోరనే భయం ఉండి ఉండ వచ్చు. అక్కడక్కడ అనవసరంగా చొప్పించిన సన్నివేశాలు పెద్దగా సినిమాకు అవసరం లేదనిపించింది.

కానీ దర్శకుడు ఈ క్లాస్ సినిమా ను మాస్ ప్రేక్షకులు కూడా చూసేలా చేసిన ప్రయత్నం ఈ సినిమాను ఎంత వరకు మాస్ ఆదరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ సూర్య ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. నిజానికి అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ క్లాస్ గా తన పాత్రలో ఇమిడి పోయాడు. హిందీలో అనుపమ్ ఖేర్ చేసిన పాత్రలో రమ్య కృష్ణ ఒక సర్ ప్రైజ్ ఎంపిక. మనోజ్ వాజ్ పాయ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రను పాత హీరో కార్తీక్ చేసినా దాని నిడివి తగ్గించాడు దర్శకుడు.

నిజానికి హిందీలో నీరజ్ పాండే లాంటి టాలెంటెడ్ యువ దర్శకుడు వాస్తవంగా జరిగిన ఒక స్టైలిష్ క్రైమ్ కథను మంచి ఫిక్షన్ జోడించి అమిత ఆసక్తి కలిగించేలా తెరకెక్కించాడు. ఈ కథను యధాతధంగా తమిళ్ లో తీసి ఉంటె తప్పకుండా ఒక సీరియస్ క్లాసిక్ చిత్రం గా ప్రశంసలు పొంది ఉండేది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేటెడ్ యువతకు సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ లేకుండా హాయ్ స్టాండర్డ్ సినిమాలు ఆదరించే స్థాయి చాలానే ఉంది. ఎందుకో దర్శకుడు తమిళ ప్రేక్షకులను తక్కువ అంచనా వేశాడు. అయినా ఈ సినిమా అందరికీ నచ్చే అన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి తమిళంలో హిట్ సినిమా చాలా సంవత్సరాలుగా లేక బాధ పడుతున్న హీరో సూర్యకు ఒక హిట్ పడే అవకాశం దండిగా ఉంది.

ఇక కథలోకి వస్తే మంచి చదువు తెలివి తేటలు నిజాయితీ ఉండే సూర్యకు సి.బి.ఐ డిపార్టుమెంటులో గుమస్తాగా పనిచేసే తన తండ్రి కోరిక అలాగే అవినీతిపరులైన ధనవంతులు రాజకీయనాయకులని పట్టుకుని వారి అవినీతిని అరికట్టాలనే దృఢ సంకల్పం తో సి.బి.ఐ డిపార్టుమెంటులో చేరాలనుకుంటాడు. కానీ అవినీతితో కూరుకుపోయిన వ్యవస్థ వలన అతనికి ఉద్యోగం రాకుండా పోతుంది. దానిపై కసితో తనకు సహాయపడే మనుషుల్ని గుర్తించి , రమ్యకృష్ణ, సెంథిల్, శివ శంకర్ మాస్టర్ తదితరులతో ఒక ఫేక్ సి.బి.ఐ ఆఫీసర్లలా ఐ డి కార్డులు కొట్టి టాక్స్ ఎగ్గొట్టే బడా బాబులను దోచుకుంటూ ఉంటారు. చట్టానికి భయపడి వాళ్ళు కూడా పోలీస్ కేస్ పెట్టలేక మధన పది పోవడం వీరికి కలిసి వచ్చేది.

కానీ ఈ విషయం సి.బి.ఐ డిపార్టుమెంటు పెద్ద తలలకు తెలిసి వారు ఏంతో తెలివిగా చాకచక్యం తో పనిచేసే సి.బి.ఐ ఆఫీసర్ కార్తీక్ ను వీళ్ళను పట్టుకునేందుకు నియమిస్తారు. ఈ సూర్య గ్యాంగ్ లో పనిచేయడానికి కీర్తి సురేష్ ను కూడా తీసుకు వస్తుంది రమ్య కృష్ణ. ఈమెతో తోలి చూపులోనే ప్రేమలో పడతాడు సూర్య.

ఈ చిన్న చిన్న ప్రయత్నాలను పక్కన పెట్టి ఒకే సారి ఒక పెద్ద గోల్డ్ జెవెల్లరీ షాప్ ను దొంగిలించే ప్లాన్ తయారు చేస్తాడు సూర్య. కానీ అటువైపు సి.బి.ఐ ఆఫిసర్ కార్తీక్ పన్నిన వలలో ఈ సూర్య గ్యాంగ్ ఎలా చిక్కుకుంటారు, చివరకు ఏమౌతుంది అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ఇక నటన పరంగా సూర్య ది బెస్ట్ అని చెప్పవచ్చు. మన శివకామి రమ్య కృష్ణ కూడా బాగానే చేసింది. కీర్తి సురేష్ గ్లామర్ కు తప్ప పెద్దగా పాత్ర లేదు. కార్తీక్ డిఫరెంట్ మేనరిజం తో ఆకట్టుకున్నాడు. మిగతా అందరూ వారి వారి పాత్రల్లో బాగా ఇమిడి పోయారు.

అనిరుధ్ సంగీతం, ప్రత్యేకంగా పాటలు, నేపద్య్హ సంగీతం బాగా ఉంది. దినేష్ కృష్ణన్ కెమెరా భేషుగ్గా ఉంది. టెక్నీకల్ గా సినిమా మంచి మార్కులే తెచ్చుకుంటుంది.

ఇది ఒక ఆసక్తికరమైన కథ కావడం వలన మనకు పెద్దగా బోర్ కొట్టదు. అందరూ మంచి ప్రతిభ ఉన్న నటులవడం వలన వారి నటన కోసం ఒక సారి తప్పక చూడొచ్చు. కొంచెం తమిళ వాసన మన తెలుగు వారికి పర్వాలేదు అనుకుంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలలో మంచి కథ, విషయం ఉన్న సినిమా ఇదే.

- పర్వేజ్ చౌదరి