January 10, 2018

Agnathavasi-Movie-Review

బాహుబలి కి ముందు నిజమైన బాక్స్ ఆఫీస్ హిట్ గా పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లోని 'అత్తారింటికి దారేది' సినిమాను చెప్పుకునే వాళ్ళం. వీరిద్దరి సినిమాకు ఇప్పుడు ఎంత హైప్ వచ్చిందంటే 'అజ్ఞాతవాసి' ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలి 2 ను మించి పోయింది. ఇంత స్థాయి లో ఆసక్తి ప్రేక్షకుల నుండి వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధతో అమితమైన బాధ్యతతో కథా, స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది పోయి కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ను వాడుకొని దానితోనే బిజినెస్ చేసుకోవాలనుకోవడం అవివేకం. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా కైనా కథ బాగ లేకపోతే ప్రేక్షకులు తిరస్కరించిన విషయాన్ని త్రివిక్రమ్ ఎలా విస్మరించాడనేది విచిత్రం. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా కెరీర్ లోనే అత్యంత పేలవంగా రాసుకున్న రచన ఇదేనని చెప్పడంలో సందేహం లేదు.

సినిమా రిలీజ్ కు ముందే వివాదాస్పదమైన కాపీ విషయం దాదాపుగా నిజమే. ఫ్రెంచ్ సినిమా ' లార్గో వించ్' లోని స్థూల కధనే ఈ సినిమాలో వాడుకున్నాడు. ఒకే తేడా దీనిలో పవన్ బోమన్ ఇరానీ సొంత కొడుకు మరి ఆ ఫ్రెంచ్ సినిమాలో అతను దత్త పుత్రుడు. కార్పొరేట్ బ్యాక్ గ్రౌండ్, ప్రతీకారం మిగతా అంతా సేమ్ టు సేమ్. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఒక సూపర్ హిట్ ఫ్రెంచ్ సినిమాను మన తెలుగు నేటివిటీ కు సరిపోయేలా మార్చడం కూడా ఒక అత్యంత సక్సస్ ఫుల్ రచయితకు చేతకాకపోవటమే.

పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాగూ ఉంది అలాగే త్రివిక్రమ్ స్టైల్ అఫ్ వర్కింగ్ అమితంగా ఇష్టపడే క్లాస్ ఆడియన్స్ కు ఈ సినిమాలోని కామెడీ మన సహనాన్ని పరీక్షించి అతనిపై చిరాకు కలిగిస్తుంది. రావు రమేష్, మురళీ శర్మ క్యారెక్టర్లు జోకర్ల కంటే హీనంగా 80 లో వచ్చిన సినిమాల్లో అల్లు రామలింగయ్య, సత్యనారాయణ స్టైల్ కామెడీ అందులోనూ పెద్ద కార్పొరేట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండడం విషాదం. అంత ప్రతిష్టాత్మక కార్పొరేట్ ఆఫీసులో వాళ్ళని అందరి ముందు బెల్టుతో కొట్టడం ఆఫీస్ అంతా పవన్ సైకిలు ఎక్కి తిరుగుతూ వాళ్ళను తరుము కొనే సన్నివేశాలు చూస్తే త్రివిక్రమ్ బాధ్యతతో ఈ సినిమా తీయాలనుకున్నాడా లేక ఇద్దరూ మందు కొట్టి షూటింగ్ ఎంజాయ్ చేశారా అనిపిస్తుంది.

ఇక హీరోయిన్లు ఇద్దరూ కొట్టుకోవడం, తిట్టు కోవడం చూస్తే పాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ప్రవర్తించే అతి చేష్టలు గుర్తుకు వస్తాయి. ఇంత టెక్నాలజీ పెరిగి అమ్మాయిలు తెలివితేటల్లో అబ్బాయిలను పూర్తిగా అధిగమించి అద్భుతంగా రాణిస్తున్న ఈ రోజుల్లో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లను తలకాయ లేని పెద్ద దద్దమ్మలు గా చూపించడం చాలా ఘోరం, ఒక రకంగా పెద్ద నేరం కూడా.

ఇక ‘‘సింహం పార్టీకి పిలిచిందని జింక జీన్స్ ప్యాంటేసుకుని వచ్చిందట’’ తరహా పంచులు.. ‘‘విచ్చలవిడిగా చేస్తే విధ్వంసం.. విచక్షణతో చేస్తే ధర్మం’’ లాంటి డైలాగులు మినహాయిస్తే అతని మార్కు గుర్తుండి పోయే డైలాగులే లేవు. ఎలాగూ రాజకీయాలలో యాక్టివ్ అయినా పవన్ కళ్యాణ్ ను ఇతను మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా అనే డైలాగు చాలా అప్రస్తుతం ఈ సినిమా వరకైతే అదన ప్రసంగం. సగటు పవన్ ఫ్యాన్స్ ను పక్కన పెడితే కొంచెం పరిణతి చెందిన ఆలోచనా విధానం ఉన్న ఫాన్స్ అయితే తమ అభిమాన హీరోను ఇలా వాడేసుకొని ఈ దర్శకుడి కెరీర్ లోనే బ్యాడ్ సినిమా తీసినందుకు త్రివిక్రమ్ బాధ్యతా రాహిత్యానికి గర్హించాలి.

ఇక కథలోకి వస్తే బోమన్ ఇరానీ ఒక మధ్య తరగతి కుటుంబం నుండి తన తెలివితేటలతో ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్నే సృష్టిస్తాడు. అలాగే తనతో ఉన్న వాళ్ళ తో వైరం కూడా పెంచేలా చేస్తుంది. అతని భార్య ఇంద్రజ గర్భం తో ఉండగా ఆమెపై అటాక్ జరుగుతుంది. ఆమెకు పుట్టిన పవన్ కళ్యాణ్ ను ప్రపంచానికి దూరంగా గోప్యంగా పెంచుతాడు. ఇంద్రజ మరణానంతరం 7 ఏళ్ళ తరువాత ఖుష్బూ ను పెళ్లాడతాడు. ఈమె సవితి తల్లిలా కాక ఎంతో ప్రేమ చూపిస్తుంది.

బిజినెస్ లోని శత్రువులు బోమన్ ఇరానీ కి ఖుష్బూ కు పుట్టిన కొడుకు ను, తరువాత బోమన్ ఇరానీ చంపేస్తారు. అప్పుడు అజ్ఞాతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను పిలుస్తుంది ఖుష్బూ. ఇక పవన్ ఆ సామ్రాజ్యం లో ఎలా ప్రవేశిస్తాడు , హంతకులను ఎలా కనుక్కొని వారిని అంతమొందిస్తాడు అనేదే మిగతా కథ.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో చాలా అందంగా ఎంతో రిచ్ గా అమితమైన స్టైలిష్ గా కనబడతాడు. సినిమా మొత్తం తన భుజ స్కంధాలపై నడిపించాడు. కానీ సినిమాలో త్రివిక్రమ్ రాసుకున్న పెద్దగా నవ్వు రాని హాస్య సన్నివేశాలలో పాపం పవన్ కొంత వరకు బాలి అయ్యాడని చెప్పవచ్చు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. వీరు గ్లామర్ కు తప్ప వీరికి సినిమాలో పెద్దగా చేసేదేమీ లేదు. ఖుష్బూ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ను పూర్తిగా వాడుకోలేదు. ఆది పినిశెట్టికు కూడా చేయడానికి పెద్దగా ఆస్కారం లేని పాత్ర.

ఈ సినిమా టెక్నికల్ గా చాలా రిచ్ గా ప్రతి సన్నివేశంలో ఖర్చు చేసిన డబ్బు బాగా కనపడుతుంది. అనిరుధ్ సంగీతం బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ రెండు పాత హిట్ సినిమాలలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర చాలా ఎక్కువ. అతన్ని ఎందుకు వదిలేశారో వాళ్ళకే తెలియాలి. మణి కంఠన్ కెమెరా అద్భుతంగా ఉంది.

మొత్తానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సుకు అలాగే త్రివిక్రమ్ ను ఇష్టపడే వారిని నిరాశ పరిచింది. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిన దోషి మాత్రం త్రివిక్రమ్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్ప వచ్చు.

- పర్వేజ్ చౌదరి